భమిడిపాటి రామగోపాలం
భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు. నాన్న సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. అమ్మ సూరమ్మ. ఇద్దరు తమ్ముళ్లు. నాన్న ఉద్యోగ రీత్యా వివిధ ఊళ్లు తిరిగారు. విజయనగరంలో స్థిరపడ్డారు. ఐదో తరగతి వరకు నాన్న ఇంటి దగ్గరే చదువు. అలమండ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో ఆరో తరగతి. 1951లో బీ.ఏ. భాగల్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. (ఇంగ్లిషు), ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ. (తెలుగు) చేశారు. విజయనగరం సత్రంలో ఉచిత భోజనం చేస్తూ, పిల్లలకు ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించి, అది ఇంటికి ఇస్తూ చదువుకున్నారు. 1951లోనే విజయనగరంలోనే సెన్సస్ ఆఫీసులోచెకర్‌గా ఉద్యోగ జీవితం మొదలైంది. అప్పటి మద్రాసు సర్వే విభాగంలో గుమస్తాగా, సర్వేయర్‌గా, హెడ్ సర్వేయర్‌గా పనిచేశాను. వివిధ ప్రదేశాలు తిరిగారు. 1967లో నర్సరావుపేటలో ఉద్యోగం చేశారు. అప్పటికే రచనా వ్యాసంగంలో ఉండటం, రేడియో స్టేషన్‌కు వెళుతుండటం వంటి వ్యాపకాల వల్ల తరచూ విజయవాడలో ఉండేవారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు బదిలీ అయ్యారు. కాఫీ అన్నా, ఆంధ్రపత్రికన్నా, రేడియో అన్నా ప్రాణం. బోధన్‌లో అవి ఉండవని, ఉద్యోగానికి సెలవు పెట్టి బెజవాడ వీధుల్లో తిరుగుతూ నార్ల వెంకటేశ్వరరావుగారి కంటబడ్డారు. ఆయన అక్కడిక్కడే ఉద్యోగం ఇచ్చి ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారికి అసిస్టెంట్‌గా నియమించారు. 1967 నుంచి 68 వరకు అక్కడ పనిచేశారు. 1985-86 మధ్య మద్రాసు నుంచి వెలువడే ఉదయ భారతి పత్రిక ఎడిటర్‌గా చేశారు. 1974లో విశాఖ పోర్టులో చేరి, 1990లో ఉద్యోగ విరమణ చేశారు. 1974-78 మధ్య 'ఈనాడు' కల్చరల్ రిపోర్టర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లకూ కొన్నాళ్లు పనిచేశారు. 78వ పడిలో రెండు కాళ్లు వేళ్లూ పడిపోయినా సహాయకులకు మౌఖికంగా చెబుతూ సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆస్టియో ఆర్త్థ్రెటిస్ వల్ల రెండు కాళ్లు పనిచేయడం లేదు. 2004 నుంచీ కాలివేళ్లు, చేతి వేళ్లకు తిమ్మిరి. ఇంటా, బయటా చక్రాల కుర్చీలోనే. అయినా సాహితీ వ్యాసంగాన్ని మానలేదు. ఆరు కథా సంపుటాలు, మూడు నవలలు వెలువరించారు. తన ఆత్మకథను "ఆరామ గోపాలమ్" పేరుతో సచిత్రంగా ప్రచురించారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై 17 సావనీర్లు రూపొందించారు. మిత్రుడి జ్ఞాపకార్థం నెలకొల్పిన జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్ తరపున అనేక పుస్తకాలు ప్రచురించారు. 'ఇట్లు మీ విధేయుడు'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న రచయిత. భార్య సత్యభామ. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. నాతో 49 ఏళ్లపాటు సహజీవనం చేసిన సత్యభామ చనిపోయింది. అనారోగ్యం వల్ల శరీరం సహకరించకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు.7.4.2010 న భమిడిపాటి రామగోపాలం (భరాగో) విశాఖ నగరంలో కృష్ణా కళాశాల సమీపంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.
భావాలు
నేను సున్నా నుంచో... మరీ చెప్పాలంటే మైనస్ నాలుగు నుంచో జీవితం మొదలు పెట్టాను.పేదరికం చాలా గొప్పది. అది పని చేసే ఉద్దేశం కలుగచేస్తుంది.
నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. సంతోషంగా బతికాను. బతికినంత కాలం పనిచేస్తూ ఉండటమే నా లక్ష్యం. సాహితీరంగంలో నాకంటే ఘనులు చాలా మందే ఉన్నారు. కానీ నా ప్రత్యేకత నాకుంది. నాకు భోజనం, దుస్తులు, ధనం మీద ఆసక్తి తక్కువ. అందుకే ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాను. జీవితాన్ని తేలిగ్గా తీసుకోవాలి.
(మూలం:http://www.telugusahityam.com/2011/05/itlu-mee-vidheyudu-bhamidipati-rama.html)
No comments:
Post a Comment