Wednesday, April 10, 2013

ఉగాది శుభాకాంక్షలు



సకల శుభాలకు నాందీ ప్రస్తావన..

పూల సోయగాలు కనువిందు చేసేది..

కొమ్మలు కొత్త చిగురులు తొడుక్కునేది..
‘ఫల రాజై’న మామిడి చేతికందేది..
శివుడికి మల్లెలు అర్చించేది..
హాయిగా కోకిల గానం వినిపించేది..
కవుల వర్ణనలకు కొరత తీరేది..
- ఇవన్నీ నవ వసంతం లోనే..!
ఆరు రుతువుల్లో అందరినీ మైమరపించేది- వసంత రుతువే. శ్రీకృష్ణ పరమాత్మ సైతం- ‘రుతువుల్లో నేను వసంత రుతువున’ని చెప్పాడట. తెలుగు నాట చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి ఏటా జనవరి ఒకటవ తేదీని నూతన సంవత్సరం ఆరంభంగా భావిస్తున్నా, ఖగోళ స్థితిగతులను బట్టి సంవత్సర ఆరంభాన్ని వసంతకాలంలోనే గుర్తించాల్సి ఉంది. తెలుగు వారు కచ్చితంగా సంవత్సరారంభాన్ని ఉగాదిగానే భావించి పండగ జరుపుకోవడం సముచితం. ఇందుకు విరుద్ధంగా జనవరి ఒకటిన అట్టహాసంగా, విశృంఖలంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం అసమంజసం.
సరికొత్త జీవనానికి నాంది ఉగాది. వసంత రుతువులో సోయగాల ప్రకృతిని తిలకించడంతో మనసెంతో తేలికపడుతుంది. సూర్యుడు తన నులివెచ్చని కిరణాల వేడిని పెంచుకుంటూ వసంత రుతువులోని అందాలను మరింత కాంతివంతం చేస్తుంటే- చైత్రమాస ఉగాది లక్ష్మి వయ్యారంగా నడుచుకుంటూ తెలుగునాట ప్రతి ఇంటా ప్రవేశించే శుభారంభమైన రోజే ఉగాది.
రుతు, మాస, పక్షాలకు సంబంధించిన పండగ ఉగాది. రుతువులలో మొదటిది వసంతం. మాసాలలో మొదటిది చైత్రం. పక్షంలో మొదటిది శుక్లపక్షం. కనుక చైత్ర శుద్ధ శుక్ల పాడ్యమి నాడు ఉగాది జరుపుకోవడం ఆచారంగా మా రింది. ఉగాది నుంచి తెలుగు పండగలు వరసగా మొదలవుతాయి. ప్రతి పండగకూ ఏదో ఒక దైవంతో సంబంధం ఉంటుంది. కానీ, ఉగాదికి ప్రత్యేకంగా ఏ దేవుడ్ని లేక దేవతను పూజించే ఆచారం లేకపోవడంతో ఎవరికి వారే తమ ఇష్ట దైవాలను కొలుస్తుంటారు. ఉగాది పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించినన పురాణ, ఇతిహాసాల ప్రకారం అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను దొంగిలించిన సోమకుడిని సంహరించిన దినం చైత్రశుద్ధ పాడ్యమి కావడంతో దానిని ఉగాదిగా జరుపుకుంటున్నారన్నది ఓ కథనం. శ్రీరాముడు రావణ సంహారం తరువాత చైత్రశుద్ధ పాడ్యమి రోజునే అయోధ్యకు తిరిగి వచ్చి పట్ట్భాషిక్తుడైనాడని మరో కథనం. ధర్మరాజు కూడా ఇదే రోజున పట్ట్భాక్తుడైనట్లు మహాభారతం చెబుతోంది. గణిత శాస్తవ్రేత్త వరాహ మిహిరుడు (ఆర్యభట్ట) ఈరోజే తొలి పంచాంగాన్ని ఆవిష్కరించాడని పెద్దలు చెబుతారు. ఇన్ని విశిష్టతలు కలిగిన చైత్రశుద్ధ పాడ్యమిని సకల శుభాలను కలిగించే రోజుగా భావిస్తుంటారు.
సంప్రదాయాల వెల్లువ...
ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో, పూలతో, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని, ఇష్ట దైవాన్ని ప్రతిష్ఠించి షోడశోపచారాలతో పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలే కాకుండా, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రధానంగా నివేదించాలి. ఉగాది నాడు అభ్యంగన స్నానమాచరించడం శుభప్రదం, ఆరోగ్య ప్ర దం. నువ్వుల నూనెలో మహాలక్ష్మి, జలంలో గంగాదేవి కొలువై వుంటారనేది ఆర్యోక్తి. నువ్వుల నూనె, సున్నిపిండి, కుంకుడు రసంతో తలస్నానం ఆచరించడం మంచిది. సంప్రదాయ బద్ధమైన దుస్తులు ధరించి, తొలుత ఉగాది పచ్చడిని ఆరగించి, తరువాత అల్పాహారాన్ని భుజించడం మన ఆచారం. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపడం, వారితో కలిసి భోజనం చేయడం ఉగాది ప్రత్యేకత.
ఆరోగ్య ప్రదాయిని ఉగాది పచ్చడి...
ఆరు రుచులతో చేసే ఉగాది పచ్చడి దివ్య ఔషధమనే చెప్పాలి. వేపపువ్వు, చింతపండు గుజ్జు, కొత్త బెల్లం, కొబ్బరి, మామిడి ముక్కలు, చెరకు రసం, అరటి పళ్లు, ఉప్పు,కారంతో తయారయ్యే ఉగాది పచ్చడి శారీరక దోషాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఉగాది పచ్చడి వేసవి తాపాన్ని సైతం చక్కబెడుతుంది. నిజానికి చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు ( 15 రోజులు)ఈ పచ్చడిని ప్రతిరోజూ తింటే రుతు సంబంధిత లోపాలు తగ్గుతాయని శాస్త్రం చెబుతోంది.
కాగా, పాశ్చాత్య ధోరణులు పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో ఉగాది పచ్చడి నేటి తరం వారికి రుచించకపోవడం దౌర్భాగ్యం. కాలానుగుణ మార్పులతో ఉగాది పచ్చడిని సైతం మార్కెట్‌నుంచి ఇంటికి తెచ్చుకోవడం మరీ విడ్డూరం. కాలగమనంలో ఎన్ని మార్పులు వచ్చినా, జీవితం ఎంత బిజీ అయనా- ఈ అచ్చతెలుగు పండగ దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎంతైనా సంవత్సరారంభంలో అమ్మచేతి ఉగాది పచ్చడి అమృతతుల్యమే! దానికోసం ఎదురు చూసే తత్వాన్ని నేటి తరానికి నేర్పించాల్సిన బాధ్యత పెద్దలదేనని వేరే చెప్ప నక్కర్లేదు.(ఆంధ్రభూమి  సౌజన్యంతో)